క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి, సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు..! ప్రియులారా ఈరోజు దేవుని వాక్యం చూసినట్లు అయితే 1 తిమోతికి 3:1

ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.

‘ దేవుడు మనలను పిలిచిన పిలుపు ఏంటో, దర్శనం ఏంటో మనకు తెలిసి ఉండాలి. తెలియకపోవడం వలన ఎన్నో అనర్థాలు ఎదురవుతాయి. ఎన్నో సంఘాలలో అనవసరమైన ఇబ్బందులు ఎదురయ్యేది దీని గూర్చియే. నీ పిలుపు ఏంటో నీవు దానికి తగినట్లే నడుచుకో. దేవుడు నిన్ను సేవకు పిలిచాడా? సేవ చేయు. కేవలం ఒక విశ్వాసిగా ఉంచి, ఒక మంచి ఉద్యోగంలో ఉండేలా చేశాడా ? నీవు ఆ పనిలో నమ్మకంగా ఉండు. దేవుని సంఘములో ఒక సంఘ పెద్దగా ఉన్నావా ? అయితే నీకు దేవుడు ఇచ్చిన ఈ పిలుపును నమ్మకంగా నెరవేర్చు. పరిశుద్ధ గ్రంథములో విశ్వాసిగా ఉండటానికే ఎన్నో రకాల ప్రతిష్టలు, ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో విషయాలు ఉన్నాయి; అయితే అధ్యక్ష పదవిలో ఉండాలి అంటే ఇంకా ఎక్కువగానే ఇచ్చారు కదా ! అయితే ఈ కాలంలో విశ్వాసులుగా కూడా సరిపోని వారిని సంఘ పెద్దగా నియమించే వారు లేకపోలేదు. వారి మూలంగానే సంఘంలో ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. నీవైతే దేవుని భయం కలిగి, దేవుని పిలుపు ఏంటో తెలుసుకొని ఆ పిలుపుకు తగిన జీవితం జీవించు. దేవుడు నిన్ను నిజముగా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మన అందరికీ దయ చేయును గాక ! పరిశుద్ధులకు కృప తోడై యుండును గాక! ఆమేన్

Leave a Comment