దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్రెయలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.
క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి, సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు..! ప్రియులారా ఈరోజు దేవుని వాక్యం చూసినట్లు అయితే దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.
* ( ఈ వాక్యము కేవలము స్త్రీల కొరకే కాదు, పురుషుల కొరకు కూడా… ) ఈ కాలంలో అలంకరించుకోవడం అంటే నచ్చనివారు ఉండరు. పైగా సమయము, సందర్భము కూడా లేకుండా ప్రతిరోజూ అలంకరించుకునే వాళ్ళు కూడా మన మధ్యన ఉన్నారు. అసలు అలంకరించుకోవడం ఎందుకు అని చూస్తే అది కేవలం ఎదుటివారి కొరకే…! మనలను ఎవరైతే చూస్తారో వారు ఒక మంచి దృష్టితో చూడాలి, ఎదుటివారి ముందు పొరపాటున కూడా చిన్నచూపు కాకూడదు. అందము వ్యర్థము, సౌందర్యము మోసకరము అని వాక్యం చెప్తుంది; ఈ వాక్యము మీకు కూడా తెలుసు అని ఆశిస్తున్నాను. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది.. అలంకరణ అంటే మన శరీరానికి చేసుకునేది కాదు. మనము సత్ క్రియలచేత అలంకరించుకోవాలి అని వాక్యం చెప్తుంది. అనగా మనం చేసే మంచి క్రియలు…! దైవభక్తిలో ఉండటం, దేవుడు చెప్పిన ఆజ్ఞలను అనుసరించడం, ఆయన కృపను బట్టి ఆయన చిత్తంలో నడవడం, మనకు కీడు చేసే వారికి కూడా మేలు చేయడం, మన శత్రువులను ప్రేమించడం, వారి కొరకు ప్రార్థించడం ( లూకా 6:27,28), బీదలను కనికరించడం ( కీర్తనలు 41:1 ) లాంటివి ఇంకా ఎన్నో ఎన్నో సత్ క్రియలు యేసయ్య చెప్పినవి ఉన్నాయి. వాటిని చేయుట చేత మనలను మనము అలంకరించుకోవాలి అట. ఈ అలంకరణ చూసే మనుష్యులు మనలను దేవుని బిడ్డలుగా గుర్తిస్తారు. మన క్రియలను చూసే మనం దేవుని బిడ్డలమా, సైతాను బిడ్డలమా అని లోకం గుర్తిస్తుంది. దేవుని కృపను బట్టి మనం బ్రతికినంత కాలము దేవుని కొరకు సత్ క్రియలు చేయుదుము గాక ! అట్టి కృప దేవుడు మనకు దయ చేయును గాక ! పరిశుద్ధులకు కృప తోడై యుండును గాక! ఆమేన్